విచారణకు రావాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
సుకేశ్ చంద్రశేఖర్ నుంచి విలువైన ఆభరణాలు బహుమతి
కుటుంబ సభ్యులకూ అత్యాధునిక కార్లు అందజేత
₹200 కోట్ల కుంభకోణంలో కొనసాగుతున్న విచారణ
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ₹200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు లో జాక్వెలిన్‌కు ఈడీ బుధవారం సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే జాక్వెలిన్‌ను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా, ₹200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్‌ను ఈడీ అరెస్టు చేయకపోయినా.. 2022 నవంబర్ 15న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించి, ఆస్తులను సైతం అటాచ్ చేసింది.
జాక్వెలిన్పైనా పలు ఆరోపణలు..
జాక్వెలిన్‌కు సుకేశ్ చంద్రశేఖర్ ₹7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఈడీ ఆరోపించింది. రాన్‌బాక్సీ మాజీ బాస్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ ₹200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.