Thursday, November 7, 2024

ED | అగ్రి గోల్డ్‌ కేసులో కీలక పరిణామం.. రూ.4141 కోట్ల ఆస్తుల అటాచ్‌ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : అగ్రి గోల్డ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ని గురువారం నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌లో అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. కాగా ఈ కేసులో 14 మందిని అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. విచారణలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, అండమాన్‌ నికోబార్‌లో మరికొన్ని ఆస్తులున్నట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.

విచారణలో ఈ కేసులోని ప్రధాన నిందితులు 130 షెల్‌ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అగ్రిగోల్డ్‌ మొత్తాలను వెంకట రామారావు ఇతర ఖాతాలకు మళ్లించారని, మళ్లించిన నిధులతో పవర్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎంటర్‌టైన్మెంట్‌, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ విచారణలో వెలుగుచూసింది.

32 లక్షల మంది ఖాతా దారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను నిందితులు సొంత ఆస్తుల కోసం దారి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. తాజాగా ఈడీ ఛార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement