ఢిల్లీలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు ముందు ఈడీ తన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. బీహార్ భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కూతుళ్ల పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడుగురు నిందితుల్లో మిసా భారతి, హేమా యాదవ్ ఉన్నారు.
వ్యవసాయ భూములు తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని లాలూప్రసాద్ యాదవ్, అతని కుటుంబంపై సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూకు సన్నిహితుడైన రైల్వే ఉద్యోగి అమిత్ కత్యాల్ ఈ కుంభకోణంలో పాత్ర పోషించారని తేలింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని చార్జిషీట్‌కు ప్రతిస్పందనగా ఆర్జేడీ ఆరోపించింది. బీజేపీ ఈ వాదనను తోసిపుచ్చింది.
లాలూ ప్రసాద్ కుటుంబం చాలా ఏళ్లుగా అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. 2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి భూములిచ్చి రైల్వేలో ఉద్యోగాలు పొందారని తేలింది. 2022 అక్టోబర్‌లో లాలూ, దేవి, మిసాతో పాటు మరో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గతేడాది మార్చిలో సీబీఐ కేసులో లాలూ, రబ్రీ, మిసా తదితరులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.