పశ్చిమ బెంగాల్ విద్యా కుంభకోణంలో సంబంధమున్న ఆరోపణలపై టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. నిన్న (సోమవారం) అతడిని పిలిపించి గంటల తరబడి విచారించిన అనంతరం అరెస్టు చేసింది. గతంలో మాణిక్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. రిక్రూట్‌మెంట్ స్కామ్ ఆయన హయాంలోనే జరిగిందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అతని పేరు ప్రస్తావించారు. కోర్టు ఆదేశంతో భట్టాచార్యను విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
ఇక.. రిటైర్డ్ జస్టిస్ రంజిత్ కుమార్ బాగ్ నేతృత్వంలోని మొదటి స్వతంత్ర దర్యాప్తు కమిటీ – బాగ్ కమిటీ ఈ నివేదికను సమర్పించింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామక స్కామ్‌పై దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసిన తర్వాత మాణిక్ భట్టాచార్యను ED మొదట పిలిపించింది. భట్టాచార్య నివాసంలో నిర్వహించిన దాడుల నుండి ED రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.