Friday, October 18, 2024

Economic Survey – ఈ ఏడాది 6.5 నుంచి 7 శాతం వృద్ధి న‌మోదు – నిర్మలా సీతారామన్

నిరుద్యోగం గ‌ణ‌నీయం త‌గ్గింది
ద్ర‌వ్యోల్ప‌ణంతో నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌లో పెరుగుద‌ల
బ‌ల‌మైన స్టాక్ మార్కెట్ తో ఆర్థిక రంగం ప‌రుగులు
AI ప్రభావంతో ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి దెబ్బ‌
లోక్ స‌భ‌లో ఆర్థిక స‌ర్వేను విడుద‌ల చేసిన నిర్మలా సీతారామన్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – కేంద్ర బడ్జెట్ 2024.. 25 పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్ లో విడుదల చేశారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. 2024, జూలై 22వ తేదీ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చాలా కీలకమైన అంశాలు ఆమె ప్ర‌స్తావించారు.

- Advertisement -

ఈరోజు ఆర్థిక సర్వేలో ఏముందంటే..

దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉందని ఆర్థిక సర్వే చెబుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ 2024-25 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నా.. దేశీయంగా మాత్రం ఆ ఇబ్బంది లేదని సర్వే చెబుతోంది. అయితే, అంతర్జాతీయంగా వచ్చే పరిణామాలు ఆర్బీఐ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి తోడ్పడేలా కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి. ఇక మన దేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లదే కీలక పాత్ర అని సర్వే రిపోర్ట్ తేల్చింది. చైనీస్ ఎఫ్‌డిఐని పెంచడం వల్ల గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం వాటాను పెంచడానికి అలాగే ఎగుమతులను పెంచడానికి సహాయపడుతుంది.

దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్టు సర్వే చెబుతోంది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని వెల్లడైంది. ఇక ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను రూపొందించింది. ఇందులో రూ.14 వేలకోట్లు వరకూ ఆచరణలోకి వచ్చినట్టు సర్వే స్పష్టం చేసింది.

భ‌య‌పెడుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం ..

ఆహార ద్రవ్యోల్బణం గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంద‌ని స‌ర్వేలో పేర్కొంది. భారతదేశంలో, వ్యవసాయ రంగం ప్రతికూల వాతావరణం, క్షీణిస్తున్న నీటి నిల్వలు మరియు పంట నష్టాల కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. ఇది వ్యవసాయోత్పత్తి , ఆహార ధరలను ప్రభావితం చేసింది. దీని కారణంగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉండగా, 24లో 7.5%కి పెరిగింది. అందుకే ఉల్లి, టమాటా ధరలు పెరిగాయి.. టమాటా- పంటలకు వచ్చే వ్యాధులు, అకాల వర్షాలు, రవాణాలో సమస్యల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయింది. ఉల్లి – గత పంట సీజన్‌లో వర్షం కారణంగా రబీ ఉల్లి నాణ్యత దెబ్బతింది, ఖరీఫ్ ఉల్లి నాట్లు ఆలస్యం , ఖరీఫ్ ఉత్పత్తిపై దీర్ఘకాలిక కరువు ప్రభావం పడింది.

ఎరువుల ధరలు తగ్గే అవకాశం..

ఎరువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ బలమైన డిమాండ్ మరియు ఎగుమతులపై పరిమితుల కారణంగా, ఇది 2015-2019 స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది.

స‌ర్వేలో ముఖ్యాంశాలు..

  • 2025లో దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనా. మార్కెట్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగా రిస్క్ ఎక్కువగా ఉంటుందని.. అయినా వృద్ధి రేటును కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి.

2025 ఏడాదిలో ద్రవ్యోల్భణం.. ధరల సూచి 4.5 శాతంగా ఉంటుందని.. 2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించటమే లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు

దేశంలోని ప్రజలు 54 శాతం వ్యాధులు, రోగాలకు కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే కారణం అని.. ఈ విషయంలో మార్పు అవసరం అని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సమతుల్యమైన ఆహారం, నాణ్యమైన ఆహారం వైపు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్ని తెలిపారు నిర్మ‌లా సీతారామ‌న్

చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. దీని వల్ల దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచటానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయని వెల్ల‌డించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI ప్రభావం ఉద్యోగులు, కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంద‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.
పప్పు ధాన్యాల లోటు కొనసాగటం వల్ల.. దిగుమతులు తప్పవు అనేది స్పష్టం చేసింది ఆర్థిక సర్వే.
2023, 24 సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు అద్భుతమైన పనితీరు చూపించటంతో.. ఆర్థిక ఒడుదుడుగులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు సర్వేలో వెల్ల‌డైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, దేశంలోని క్లిష్టమైన ఆర్థిక రంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే స్థానిక ఉత్పత్తులు, వినియోగం ద్వారానే అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడింది ఈ ఆర్థిక సర్వే.

Advertisement

తాజా వార్తలు

Advertisement