Friday, November 22, 2024

TS | పార్టీలకు ఈసీ హెచ్చరికలు.. ప్రకటనల నిలిపివేతకు తాఖీదులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి ఈసీ ఝలక్‌ ఇచ్చింది. పార్టీల ప్రకటనల ప్రసారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి చెక్‌ పెట్టింది. తాము ప్రసారానికి అనుమతించిన కొన్ని ప్రకటనలను పార్టీలు ఇతర విధంగా ప్రసారం చేయడాన్ని తప్పుపడుతూ ఈసీ తాజాగా వాటిని నిలిపివేసింది. మూడు ప్రధాన పార్టీలకు ఈమేరకు నోటీస్‌లను జారీ చేసింది. తక్షణమే వాటిని నిలిపియేలంటూ పేర్కొంది. తామిచ్చిన అనుమతులను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఆయా అనుమతులను రద్దు చేసింది.

ఎన్నికల ప్రచారానికి ఉద్దేశించిన ప్రకటనలలో, ముందుగా అనుమతి మంజూరు చేసిన వాటిలో కొన్నింటిని ఉపసంహరించుకోవడానికి కారణాలను వెల్లడించింది. ఆయా ప్రకటనల్లోని అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులు, రాజకీయ పార్టీలు వక్రీకరణకు గురిచేసారనీ, దుర్వినియోగపరిచారని భావించడంవల్లనే రద్దు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో పూర్తి విరాలను వెల్లడించింది.

పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన కొన్ని ప్రకటనలను ఉపసంహరించుకోవడానికి కొన్ని పత్రికలు, ప్రసారసాధనాల్లో వచ్చిన కథనాలను ఉదహరించింది. అక్టోబర్‌ 9నుండి ఇప్పటివరకు దాదాపు 416కు పైగా ప్రకటనలకు అనుమతులివ్వగా, వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చి(మార్ఫింగ్‌), వక్రీకరించి, తప్పుగా అన్వయించడం వంటివి చేయడం జరిగిందని ఈసీ అధికారులు తెలిపారు. తామిచ్చిన అనుమతి నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా దుర్వినియోగపరచడం జరిగిందని తెలుసుకున్న తర్వాతే 15 ప్రకటనలకు అనుమతులను ఉపసంహరించడం జరిగిందని ఈసీ కార్యాలయం తెలిపింది.

- Advertisement -

రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ప్రకటించిన తరువాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ప్రచారం నిమిత్తం ఉపయోగించుకునే ప్రకటనలకు రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. వాటినే యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదీగాక, రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటూ అటువంటి ఇతర వేదికలలో కూడా ప్రసారం చేస్తున్నట్లు ఎన్నిక సంఘం దృష్టికి వచ్చింది.

దీనిని కూడా స్పష్టంగా నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తారు. ఎన్నికల ప్రచార నిమిత్తం వాడుకునే ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం నవంబరు 8,9,10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలను నిర్వహించి, దానికి హాజరయిన ప్రతినిధులకు ప్రచార, ప్రసార అనుమతి పొందడానికి ఉన్న మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించింది. సామాజిక మాథ్యమాలతో సహా పత్రికలు, టీవీలు, డిజిటల్‌ మీడియాలవంటి పలు వేదికల మీద వినియోగించుకోవడం లేదంటే దుర్వినియోగపరచడం, అటువంటి సందర్భాల్లో తలెత్తే సమస్యలను కూడా అన్ని పార్టీలకు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఆయా నియమావళిని ఉల్లంఘించిన సందర్భాల్లో, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ధృవీకరణ అనుమతిని ఉపసంహరించుకోవడం జరుగుతుందని కూడా అప్పుడే వెల్లడించారు.

అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు అప్పటి సమావేశానికి హాజరై మార్గదర్శకాలను అనుసరిస్తామని స్పష్టంగా తేల్చిచెప్పారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ఎలక్ట్రాన్రిక్‌ మీడియా(టీవీ ఛానళ్ళు)వాటిలోని అంశాలను, అనుమతి ధృవీకరణ పొందిన ప్రకటనలతో సరిచూచుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరుతున్నది. ఇలా సరిచూచుకోవడానికి ఎన్నికల సంఘం కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్‌(సమాచార ప్రసార విభాగం) వద్ద అనుమతి పొందిన ప్రకటనలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మీడియాకు సంబంధించిన ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజకీయ పార్టీలు విడుదల చేసే ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతి ధృవీకరణ ఇవ్వడం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియగా వెల్లడించింది. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధృవీకరణకోసం మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ-కి ప్రకటనలను పంపుకోవచ్చని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ సందర్భంగా తిరస్కరణకు గురైన ప్రకటనల జాబితాను ఈసీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement