Wednesday, November 20, 2024

EC – నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు మోగనున్న న‌గ‌రా

ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా జాతీయ మీడియా పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే హర్యానా , మహారాష్ట్ర , జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించనుంది. దీంతోపాటు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

మహారాష్ట్ర, హర్యానా విధానసభల పదవీకాలం నవంబర్ 3, నవంబర్ 26తో ముగియనుంది. ఇక జార్ఖండ్‌ అసెంబ్లీ పదవీకాలం మాత్రం వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఖాయంగా తెలుస్తోంది. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌, లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే కమిషన్‌ బృందం లోయను సందర్శించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తీసుకుంది.

మ‌రోవైపు ఇటీవ‌ల ముగిసిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌మ్మూ క‌శ్మీర్‌లో 58.58 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం ప‌ట్ల ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత మూడునాలుగు దశాబ్దాల్లో ఈసారే కశ్మీర్‌లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. కాగా, గతంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో 107 స్థానాలు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. వీటిలో 24 సీట్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో జమ్ము ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్‌ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement