న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రబీ సీజన్ రైతు బంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు అభ్యంతరం లేదని (నో అబ్జెక్షన్) తెలిపిన ఈసీ, సోమవారం తాజాగా ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలతో పాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకే రైతు బంధు నిధుల విడుదలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రైతు బంధు చాలాకాలంగా కొనసాగుతున్న పథకం కాబట్టి తొలుత నిధుల విడుదలకు పచ్చ జెండా ఊపిన ఈసీ, ఆ సమయంలో కొన్ని షరతులు విధించింది. ఆ ప్రకారం…
01. కొత్తగా లబ్దిదారుల జాబితాలో ఎవరినీ చేర్చకూడదు.
02. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయరాదు.
03. నిధుల విడుదలను ఒక ప్రభుత్వ వేడుకగా నిర్వహించకూడదు
04. నిధుల విడుదల ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం, ప్రమేయం ఉండకూడదు
05. నిధులు నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి జమ చేయాలి. చెక్కుల రూపంలో కూడా పంపిణీ చేయడానికి వీల్లేదు
ఈ నిబంధనల మేరకు నిధులు విడుదల చేసేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. అయితే ఆదివారం (నవంబర్ 26న) రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న టి. హరీశ్ రావు ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. రైతు బంధు నిధుల విడుదల గురించి ప్రస్తావించారు. అంతేకాదు, ఏ సమయంలో విడుదల చేస్తామన్నది కూడా ఆయన తన ప్రసంగంలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఉన్న హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది.
హరీశ్ రావు వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ, ఆయన ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను ఉల్లంఘించారని భావించింది. అంతేకాదు, ఆయన వ్యాఖ్యల కారణంగా పోటీలో ఉన్న పార్టీల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా పోతుందని ఈసీ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో నవంబర్ 25న నిధుల విడుదలకు తాము ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ అమల్లో ఉన్నంతవరకు తమ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది.