టర్కీలో దాదాపు నెలన్నర విరామం తర్వాత మళ్లిd భూకంపం సంభవించింది. గోక్సన్ జిల్లాకు నైరుతి దిశలో 6 కి.మీ దూరంలో శనివారం 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యుఎస్జీఎస్) తెలిపింది. భూకంప కేంద్రానికి 7 కి.మీ లోతులో భూకంపం చోటు చేసుకుందని యుఎస్జీఎస్ పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
టర్కీలోని మెడిటరేనియన్ ప్రాంతంలో గోక్సన్ పట్టణం, కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం నష్టాన్ని, మనోవేదనను టర్కీ ఇప్పటికీ ఎదుర్కొంటునే ఉంది. ఫిబ్రవరి 6న ఉదయం 4.17 గంటలకు దక్షిణ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో టర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 50 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆపార ఆస్తి నష్టం వాటిల్లింది.