గాబ్రియెల్ తుపానుతో వణుకుతున్న న్యూజిలాండ్‌ను భూకంపం హడలెత్తించింది. బుధవారం వెల్లింగ్టన్లో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు తెలుపారు. పరపరము పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో.. 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. భూకంపం ధాటికి వెల్లింగ్టన్లో కొన్ని సెకన్లపాటు బలమైన వణుకులు సంభవించినట్లు పేర్కొన్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ను గత కొన్నిరోజులుగా గాబ్రియెల్ తుఫాను వణికిస్తోంది. నార్త్ ఐలాండ్, ఆక్లాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.
భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఓ వంతెన కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.