హిమాలయన్ దేశం నేపాల్లో భూకంపం సంభవించి సుమారు 128 మంది మృతి చెందారు పదుల సంఖ్యలో గాయపడ్డారు. అందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు. నేపాల్లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదని చెప్పారు. ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. భూకంపం ధాటికి రోడ్లపై కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు దెబ్బతినడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.