అమెరికాలో భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలో ఉన్న లాస్ ఏంజిలిస్ నగరాన్ని వణికించింది. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి..
మరికొన్ని బీటలు వారాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారం రోజుల వ్యవధిలో భూమి కంపించడం అమెరికాలో ఇది రెండోసారి.
పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ జోన్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు లాస్ ఏంజిలిస్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా రికార్డయినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ప్రకంపనల తీవ్రత శాన్‌డియాగో, పసడేనా, గ్లెన్‌డేల్, మన్‌హట్టన్ బీచ్, ఎల్ సెగుండో బీచ్, హన్నింగ్టన్ బీచ్ వరకూ కనిపించింది.లాస్ ఏంజిలిస్ సిటీ హాల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో గల హైలాండ్ పార్క్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.
ప్రఖ్యాత హాలీవుడ్ సైన్, గ్రిఫిత్ అబ్జర్వేటరీకి అత్యంత సమీపంలో ఉంటుందీ ఏరియా. ఉపరితలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.ప్రకంపనలు సంభవించిన వెంటనే లాస్ ఏంజిలిస్, పసడేనా, గ్లెన్‌డేల్ వంటి ప్రాంతాల్లో పలువురు స్థానికులు నివాసాలు, కార్యాలయాలను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు.
కొన్ని గంటల పాటు అక్కడే గడిపారు. పలు నివాసాల్లో వస్తువులు కిందపడ్డాయి. చెల్లాచెదురు అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.లాస్ ఏంజిలిస్ తీర ప్రాంత నగరమే అయినప్పటికీ.. భూకంప తీవ్రత భారీగా లేకపోవడం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయలేదు. ముందు జాగ్రత్త చర్యగా బే ఏరియాను ఖాళీ చేయించారు. భూకంపం వల్ల ఇళ్లు, ఇతర భవనాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని లాస్ ఏంజిలిస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
కొద్దిరోజుల కిందటే కాలిఫోర్నియాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. గ్రేప్‌వైన్, బేకర్స్‌ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో కిందటివారం భూమి ప్రకంపించింది. దీని తీవ్రత భారీగా లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.