Tuesday, November 19, 2024

అఫ్గాన్‌లో భూకంపం, 1000 మంది మృతి.. నేలమట్టమైన వందలాది ఇళ్లు

అఫ్గానిస్తాన్‌లోని తూర్పు ప్రాంతం భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని ఖోస్త్‌, పక్టికా ప్రాంతాల్లో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిధిలాల్లో చిక్కి కనీసం వెయ్యిమంది మరణించారు. మరెందరో శిధిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఆరువందలమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఖోస్త్‌కు 44 కి.మి. దూరంలోను, పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 450 కి.మి. దూరంలోను భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన ప్రాంతం పూర్తిగా పర్వతశ్రేణులు, వాటి మధ్య పల్లెలతో ఉండటంతో సహాయక చర్యలు కష్టసాధ్యమవుతున్నాయి.

పర్వత ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పటిష్టంగా లేకపోవడంతో భూకంపం ధాటికి పేకమేడల్లా కూలిపోయాయి. తాలిబన్లు అధికారం చేపట్టాక దేశంనుంచి విదేశీ సంస్థలు, అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో వెంటనే సహాయం అందించేవారు కరవయ్యారు. మరోవైపు అఎn్గానిస్తాన్‌ ప్రభుత్వం భూకంప బాధిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించింది. ప్రత్యేక హెలికాప్టర్లలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు క్షతగాత్రులకు అక్కడికక్కడే రోడ్డుపైనే వైద్యచికిత్సలు చేస్తున్నారు. కుప్పకూలిన ఇంటి శిథిలాలపైనే కూర్చుని వైద్యం చేయించుకుంటున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అఫ్గానిస్తాన్‌న్‌ ఉన్నతాధికారి షారఫుద్దీన్‌ భూకంప ప్రభావం, మృతుల సంఖ్యపై వివరాలు వెల్లడించారు.

ప్రధానమంత్రి మొహమ్మది హస్సన్‌ అఖుండ్‌ అత్యవసర సమావేశంనిర్వహించి తాజా పరిస్థితిని సమీక్షించారు. అధ్యక్ష భవనం కేంద్రంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఫక్టికాలోని నాలుగు జిల్లాలు, ఖోస్తా ప్రాంతంలో భూకంప బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి అఫ్గానిస్తాన్‌ రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌ రమీజ్‌ అల్కబరోవ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు పాక్‌ భూభాగంలోనూ భూకంప ప్రభావం కన్పించింది. అక్కడ కూడా అనేక ఇళ్లు కుప్పకూలిపోయాయి.
భయానక దృశ్యాలు

ఖోస్త్‌, పక్టికా ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, భూకంపం కారణంగా మరణించినవారి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు ఒకటి తరువాత మరోటి చొప్పున గోతులు తవ్వుతూనే ఉన్నారని పక్టికా ప్రాంత సమాచార, సాంస్కృతిక విభాగం ఉన్నతాధికారి మొహమ్మద్‌ అమిన్‌ హుజాయ్‌ఫా వెల్లడించారు. పక్టికా, ఖోస్తా ప్రాంతాల్లో ఎటు చూసినా శిథిలాలు, రోదిస్తున్న బాధితులే కన్పించారు. కూలిపోయిన ఇళ్ల శిధిలాల్లోంచి ఇటుకలను, రాళ్లను ఏరి దాచుకుంటున్నవారు కొందరైతే, తమవారి ఆచూకీ కోసం వెదుకుతున్నవారు మరికొందరు.

- Advertisement -

ఆ శిథిలాలపైనే కూర్చుని వైద్యం చేయించుకుంటున్నవారితో ఆ ప్రాంతం అంతా విషాదంతో నిండిపోయింది. సైనిక హెలికాప్టర్లలో కొందరిని తరలించారు. కాగా తక్షణం సహాయక చర్యలు చేపట్టేందుకు ఐరాస, ఐరోపా సమాఖ్య ముందుకువచ్చాయి. భూకంప పీడిత ప్రాంతాల్లో అన్ని విధాల సహాయం అందించేందుకు పనిచేస్తున్నామని అఫ్గానిస్తాన్‌లోని ఐరోపా సమాఖ్య ప్రత్యేక రాయబారి తోమస్‌ నిక్లాసన్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. అఫ్గానిస్తాన్‌లో, ప్రత్యేకించి హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో తరచూ భూకంపాలు సంభవించడం పరిపాటి. కాగా బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement