చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో జిన్జియాంగ్ దక్షిణ ప్రాంతంలో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ తీవ్ర భూకంపం ధాటికి భారత రాజధాని న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది.
రాత్రి 11.39 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్టు వెల్లడించింది. జనవరి 11న ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.