Saturday, November 23, 2024

శనిగ్రహం మాటున ఎర్త్‌ 2.0?, టైటాన్‌లో భూవాతావరణం.. తాజా అధ్యయనంలో వెల్లడి

మానవుడు సహా ప్రాణికోటి మనుగడకు అనుకూలమైన వాతావరణం శనిగ్రహంలోని చంద్రుడు టైటాన్‌లో ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ గ్రహం చుట్టూ రంగుల వలయాల్లో తిరుగాడుతున్న 82 చంద్రగ్రహాల్లో కీలకమైన, అతిపెద్దదైన చంద్రుడు టైటాన్‌లో భూవాతావరణాన్ని పోలిన పరిస్థితులున్నాయని వారు భావిస్తున్నారు. భూమిపై ఉన్నట్టే టైటాన్‌లో కూడా సరస్సులు, నదులు, సముద్రాలు ఉన్నాయని, ఇవన్నీ వర్షాలవల్లే ఏర్పడ్డాయని వారు నిర్ధారించారు. దానిలోని ఇసుక నేలలు, మైదానాలు, పీఠభూములు, ఉపరితలం కూడా భూమిపై ఏర్పడ్డ విధానంలోనే తయారయ్యాయని తేల్చారు. పైగా ఇక్కడి అందులోని జలరాశిలో భూమిపై ఉన్న నీటిలోకన్నా భిన్నమైన మూలకాలు, ఖనిజాలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన కీలకాంశాలను జియోఫిజికల్‌ రీసెర్చ్‌ పత్రాల జర్నల్‌లో ప్రచురించారు. స్టాన్ఫోర్డ్‌ యూనివర్శిటీకి చెందిన జియాలజిస్ట్‌ మాథ్యూ లపొట్రే సారథ్యంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. భూగోళంపై జీవరాశి మనుగడ కష్టమవుతున్న నేపథ్యంలో మానవుడు మనుగడ సాగించేందుకు అనువైన మరో గ్రహం సౌరమండలంలో ఎక్కడైనా, ఏదైనా ఉందా అన్న అన్వేషణ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త సిద్ధాంతాలు, ఆశలు చిగురిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆశాకిరణం ఖగోళ శాస్త్రవేత్తల కంటికి కనిపించింది.

వారి అంచనా ప్రకారం టైటాన్‌పై మంచుతో కూడిన ఉపరితలం ఉంది. నైట్రోజన్‌ గాలుల వల్ల హైడ్రోకార్బన్‌తో కూడిన భారీ ఇసుకతిన్నెలున్నాయి. శిలలు, ఖనిజాలు అవక్షేపణమైన రేణువులుగా మారి ఇసుక ఏర్పడటం భూమిపై జరిగే పరిణామమని, టైటాన్‌పై ఆ ప్రక్రియ కూడా అలాగే జరిగిందా అన్నది పరిశోధిస్తున్నామని ఆ బృందం వెల్లడించింది. అనంతమైన ఉష్ణోగ్రతలు, భూగర్భంలో ఒత్తిడి, జలాల వల్ల ఆ ఇసుక, మట్టి మళ్లిd శిలలుగా మారడం భూమిపై జరుగుతూంటుంది. టైటాన్‌లోనూ అలాగే జరిగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. టైటాన్‌లోని రహస్యాలను ఛేదించేందుకు నాసా ప్రయోగించిన టైటాన్‌ కేసిని ఉప్రగహం 2005 అక్టోబర్‌, డిసెంబర్‌లలోను, 2006 జనవరిలోనూ చుట్టివచ్చింది. ఆ ఉపగ్రహం అందించిన డేటా, స్పెక్టోమీటర్‌ ద్వారా రూపొందించిన మ్యాప్‌ ఆధారంగా ఈ అధ్యయనం కొనసాగింది. టైటాన్‌లో వాతావరణ ఇంచుమించు భూమిపై ఉన్నట్లే కన్పిస్తోందని, కానీ అరుణగ్రహం (మార్స్‌)లో మాత్రం కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని లాపోర్టే అభిప్రాయపడ్డారు. సౌరమండలంలో ఎక్కడో ఉన్న శనికి చెందిన అతిపెద్ద చంద్రుడు టైటాన్‌లో భూమిలాంటి వాతావరణం ఉండటం ఆశ్చర్యంగా ఉందని, అయితే ఈ విషయంలో మరెన్నో పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement