న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. టీపీసీసీ నలుగురి పేర్లను పంపగా హైకమాండ్ పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా ప్రకటించింది. మునుగోడు అభ్యర్థి ఎవరైతే బావుంటుందనే అంశంపై ఏఐసీసీ ఓ కమిటీ కూడా వేసింది.
పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించింది. సర్వే నిర్వహించి మరీ చివరకు స్రవంతి పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె అయిన స్రవంతి గతంలోనూ మునుగోడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దశాబ్దాలుగా తమ కుటుంబానికి మంచి పేరుందని, తండ్రి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎలాగైనా మళ్లీ మునుగోడులో విజయ ఢంకా మోగించాలని కాంగ్రెస్ భావిస్తుంటే… మరోవైపు బీజేపీ, టీఆర్‌ఎస్ కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి.