కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా పోలీసులు కఠితరంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ ప్రజలంతా సహకరించాలి అని డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరు రోడ్లపైకి రావడంతోనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ఏ అవసరం ఉన్నా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలన్నారు. ఈ నాలుగు గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటలోపు నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయాలన్నారు. 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్ల మీదికి వస్తే వారి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ తర్వాతే అప్పగిస్తామని చెప్పారు. అత్యవసర వాహనాలకు ప్రతి చెక్ పోస్టు వద్ద ఒక ప్రత్యేక లైను ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు. ఇంటర్ స్టేట్ బార్డర్స్ వద్ద లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. జీవో ఇచ్చిన మినహాయింపు వారు కాకుండా ఇతర వ్యక్తులు రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
కాగా, లాక్ డౌన్ నిబంధనల పేరుతో జొమాటో, స్విగ్గి డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో ఉన్న సేవలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అపేస్తున్నారంటూ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ అవేదన వ్యక్తం చేశారు. జొమాటో తమకు పెనాల్టీ వేస్తుందని, పోలీసుల ఫైన్‌తో నష్డపోతామని బాయ్స్ వాపోతున్నారు. నిత్యావసర వస్తువులు, ఈ కామర్స్ లో ఉన్న సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో నెం.102లో పేర్కొంది. అయినా పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ డెలివరీ బాయ్స్ వాహనాలను అడ్డుకున్నారు.