అవినీతి దేశ పురోగతికి అడ్డంకిగా మారిందని, మన శక్తియుక్తులను నీరుగార్చుతోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతితో సామాన్య ప్రజల హక్కులకు విఘాతం కలుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని కేవదియాలో బుధవారం జరిగిన సీవీసీ, సీబీఐ సంయుక్త సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు. అవినీతిని కట్టడి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తమ ప్రభుత్వం అవినీతిని దీటుగా ఎదుర్కొంటోందని, దళారుల ప్రమేయం లేకుండా పథకాలు అందిస్తామనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పిందని చెప్పారు. దేశ ప్రజలను మోసగించిన వ్యక్తులను ఎక్కడ ఉన్నా విడిచిపెట్టేది లేదని.. ఆర్ధిక నేరగాళ్లు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వారిని ఉద్దేశించి స్పష్టం చేశారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు.