హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చు తగ్గులు జరిపే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు మార్గంలో నడి చే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జన్నార్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీనంగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసులలో ఈనెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ డైనమిక్ ప్రైసింగ్‌ను ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయమున్న అన్ని సర్వీసులలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు, రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారు. ప్రైవేట్ పోటీని తట్టుకుని ప్రజలకు మరింతగా చేరవయ్యేందుకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుందనీ, ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కంటే 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుందని వివరించారు. అలాగే, ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చనీ, సర్వీస్ ప్రారంభయ్యే ముందు గంట వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రద్దీ తక్కువగా ఉన్న రోజులలో ప్రయాణికులను ఆకర్శించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్ స్పష్టం చేశారు.