న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ద్వారకా తిరుమలేశుడి కళ్యాణోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. శ్రావణమాసం… తొలి శనివారం… సాయం సంధ్యవేళ ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామం, కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన ప్రధాన అర్చక బృందం ఈ కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకూ జరిగిన విశేష పూజల్లో ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఉత్తరాది వారూ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ద్వారకా తిరుమల లడ్డూతో పాటు, పులిహోర, చక్రపొంగలిని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గోవింద నామ స్మరణతో ఏపీ భవన్ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
దేవస్థానం అధికారులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ… ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని వివిధ దేవస్థానాలకు చెందిన స్వామి వార్ల కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో వార్షిక క్యాలెండర్ రూపొందించనున్నట్టు తెలిపారు. ఏపీ భవన్‌కు ఎవరు ఆర్సీగా ఉన్నా క్యాలెండర్ ప్రకారం విశేష పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా ఓ ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతున్న స్ఫూర్తితోనే ఈ కళ్యాణోత్సవాల క్యాలెండర్ ఆలోచన వచ్చిందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.