హైదరాబాద్, ఆంధ్రప్రభ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ… ఈ నెల 24 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. వచ్చే నెల(అక్టోబరు) నాలుగో తేదీ వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 24, 25 తేదీలతో పాటు 30 వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు నడపనున్న ఈ సర్వీసులకు సంబంధించి అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంమీద 498 అదనపు బస్సు సర్వీసులను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్, నాంపల్లి, జూబ్లి బస్‌స్టేషన్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ల నుంచి నడపనున్న ఈ బస్సులు… అక్టోబరు నాలుగో తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తంమీద ప్రత్యేక సర్వీసులు సహా ఆయా ప్రాంతాలకు అదనపు సర్వీసులను కూడా నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, అసీఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, కరీంనగర్, గోదావరిఖని, సిద్దిపేట, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, వరంగల్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, సత్తుపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం సహా మణుగూరు, మధిర) కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప,చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, తణుకు, పామర్రు తదితర ప్రాంతాలకు అదనపు బస్సులను నిర్వహించేందుకు ఆయా పాయింట్ల నుంచి బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కాగా అదనపు సర్వీసులకు సంబంధించి అదనపు ఛార్జీలు ఉండబోవు.