హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరోమారు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఇప్పటికే పంట కోతల సమయంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, మరోమారు కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొ మరో మూడు నాలుగు రోజులు గడిస్తే ధాన్యం కాంటా అయ్యే పరిస్థితుల్లో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్ద వుతోంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షం కురిసింది.
రాత్రికి రాత్రే అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోతోంది. ధాన్యాన్ని టార్పాలిన్లు కప్పి కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. జగిత్యాల జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో రాశిపోసిన ధాన్యం వర్షందాటికి కొట్టుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు అకాల వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతుల గుండెల్లో రై ళ్లు పరుగెడుతున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలినన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతోపాటు లారీల కొరత కారణంగా ధాన్యం కాంటా వేయడంలో వారం, పది రోజుల మేర జాప్యం చోటు చేసుకుంటోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20రోజులైనా కాంటాలు వేయడం లేదని, దీంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ , ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.
నిబంధనల మేరకు 17శాతం లోపు తేమతో తాలులేకుండా ధాన్యాన్ని ఆరబోసినా కాంటాలో జాప్యం కారణంగానే అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిల్లర్ల కారణంగానే ధాన్యం కాంటా ఆలస్యమవుతోందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడ్‌లతో వెళ్లిన లారీలు వారం రోజులైనా మిల్లుల వద్ద అన్‌లోడ్ కావడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే మిల్లర్ల వాదన మరోలా ఉంది. తమకు కేటాయించిన సామర్థ్యం మేరకు ధాన్యాన్ని అన్‌లోడ్ చేశామని, అంతకు మించి కేటాయిస్తుండడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని మిల్లర్లు వాపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలను తెరిచారు. దాదాపు 40 కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో మూసివేశారు. ఇప్పటి వరకు 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజులపాటు యాసంగి ధాన్యం కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈలోగా మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ రోజూ లక్ష నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు జరుగుతోంది.