Friday, November 22, 2024

భారీ వర్షాల‌తో రిజ‌ర్వాయ‌ర్ల‌కు పెరిగిన ఇన్ ఫ్లో.. మూసీ ఒడ్డున నివ‌సించే వారికి హై అలెర్ట్!

హైద‌రాబాదఃలో రెండు రోజుల‌నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలతో రిజర్వాయర్లకు భారీ ఇన్‌ఫ్లో వ‌స్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. అధికారిక గణాంకాల ప్రకారం ఉస్మాన్‌సాగర్‌ జలాశయానికి 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వ‌స్తోంది. భారీ ప్రవాహంతో, ఉస్మాన్‌సాగర్ పూర్తి ట్యాంక్ మట్టం 1790.00 అడుగులు (3.900 TMC) ఉండగా ప్రస్తుతం 1788.00 అడుగుల (3.442 TMC)కి చేరింది. దీంతో రిజర్వాయర్‌ ప్రస్తుత స్థాయికి, పూర్తిస్థాయి సామర్థ్యానికి మధ్య కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB) అధికారులు మూసీ ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌కు కూడా 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఇక్కడ కూడా HMWSSB
అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌లో ఫుల్‌ ట్యాంక్‌ మట్టం 1763.50 అడుగులు (2.970 టీఎంసీలు) ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 1762.00 అడుగుల (2.603 టీఎంసీలు) మార్కుకు చేరుకుందని చెబుతున్నారు. ఇది పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి 1.5 అడుగుల తేడా మాత్రమే ఉంది. ఈ రెండు రిజర్వాయర్ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నీటి వనరులపై ఒత్తిడి పెర‌గ‌కుండా పరిస్థితికి త‌గ్గ‌ట్టు క్ర‌స్ట్ గేట్లను ఓపెన్ చేస్తున్నారు.

ఇక‌.. మూసీలో వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌లకు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. హిమాయత్‌సాగర్‌లోని రెండు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తివేయగా, ఉస్మాన్‌సాగర్‌లోని రెండు గేట్ల‌ను కూడా రెండు అడుగుల వరకు ఎత్తివేశారు. దీంతో మూసీ నది పక్కన నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement