Saturday, November 23, 2024

Big Story: భారీ వర్షాలకు పత్తి రైతుల కుదేలు.. ఆశించినరీతిలో రాని పూత, కాత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ వర్షాలకు పలు రకాల పంటచేలకు తీవ్ర నాష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సీజన్‌లో భారీ వర్షాలకు పత్తి చేలు ఏపుగా పెరగలేదు. ఫలితంగా కాత, పూత తగ్గిపోవడంతోపాటు కురుస్తున్న వర్షాలకు ఆ పూత, కాత కూడా రాలిపోతోంది. ఫలితంగా ఈ ఏడాది ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయి. తగు మోతాదులో వర్షాలు కురిస్తే ఎకరాకు ఎంత లేదన్నా 8 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. అయితే ఈ సారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే పరిస్థితులు ఉండడంతో ఈ ఏడాది కూడా పత్తి తెల్లబంగారం కానుందని, భారీగా డిమాండ్‌తోపాటు ధర కూడా పెరగనుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడు కూడా పత్తి క్వింటా ధర రూ.10వేలు దాటే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో పత్తి విత్తనాలు విత్తింది మొదలు తరచూ భారీ వర్షాలు కురవడంతో పత్తిచేలలో ఎరువులు వేసేందుకు, కలుపు తీసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో పత్తి మొక్కలు ఫీటున్నర కంటే ఎక్కువ ఎత్తు పెరగలేదు. దీంతో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటా రూ.12వేలకు అమ్ముడుబోయిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పత్తికి డిమాండ్‌ బాగా ఉంటుందని, రైతులు వరిసాగుకు బదులు పత్తిసాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 48లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు.

అయితే ఈ సీజన్‌లో విస్తారంగా కురిసిన వర్షాలతో మొక్కలు పెరగకపోవడంతోపాటు కొమ్మలు కూడా ఎక్కువగా రాలేదు. సాధారణంగా వర్షాలు తగ్గుముఖం పడితే ఈ మూడు నెలల కాలంలో పత్తి మొక్క నాలుగైదు అడుగుల ఎత్తు వరకు పెరగడంతోపాటు కనీసం మూడు అడుగుల మేర అయిదారు పంగలు(కొమ్మలు) రావాలి. కాని వరుసగా కురిసిన విస్తారంగా కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి… పత్తి మొక్క ఎదుగుల ఆగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చీడ పేడల ఉధృతి పెరడంతోపాటు అధిక తేమతో కాయ పక్వానికి రాకుండా నలుపురంగులోకి మారి మురిగిపోతోంది. అక్కడో ఇక్కడో పక్వానికి వచ్చిన ఒకటి రెండు కాయలు కూడా వర్షాలకు నేలరాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎన్నిసార్లు మందులను పిచికారి చేసినా కాయలు నిలవడం లేదంటున్నారు.

మరీ నల్లరేగడి నేలలు ఉన్నచోట పత్తి చేలు ఎర్రబారిపోతున్నాయి. క్రమంగా వేర్లు కుళ్లిపోయి పత్తి మొక్కలు చనిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో లక్షల ఎకరాల్లో పత్తి పంట కొట్టుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు చెట్టు ఎదగక, కొమ్మలు రాకపోవడంతో రావాల్సినంత పూత, కాయాల్సినంత కాత కూడా ఆశించినస్థాయిలో లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగు కోసం ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం చేను స్థితిని చూస్తే ఎకరాకు 2 నుంచి 3 క్వింటాల పత్తి కూడా చేతికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతున్నారు. పత్తి సాగుతో ఈ ఏడాది నష్టాలు తప్పవని, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

వాస్తవానికి ప్రతి ఏటా దసరా నాటికి మొదటి విడత (ఫస్ట్‌ పికింగ్‌) పత్తి ఏరోల్సి ఉంటుంది. అయితే ఈసారి కురిసిన భారీ వర్షాలకు కాత, పూత తగ్గిపోవడం, ఉన్న కొద్దిపాటి కాయలు రంగుమారి మురిగిపోతుండడంతో పత్తి ఏరే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉపాధి కోల్పోతున్నామని రైతు కూలీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదరాబాదరాగా పత్తిని అమ్ముకోవద్దు… మంచి ధర వచ్చే వరకు ఆగాలి: రాజేష్‌ కుమార్‌, ఏఈఓ
ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు పత్తి దిగుబడి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడకుండా సరైన ధర వచ్చే వరకు ఆగాలి. ఆదరబాదరగా దళారులకు అమ్మేసుకుని నష్టపోవద్దు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ బాగా ఉంది. అయితే ఈ యేడు కూడా పత్తికి భారీ ధర రానుంది. గతేడాది మాదిరిగా క్వింటాకు రూ.10వేలు ఉన్నట్లే ఈ యేడు కూడా ప్రారంభం నుంచి చివరి వరకు అవే ధరలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement