దేశంలో ఇంధన ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సుమారు 40 రోజులుగా పెట్రోల్, డీజెల్ ధరల్లో ఎలాంటి మార్పుల్లేవు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినా.. దాని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజెల్ ధరల్లో యధాతథ స్థితిని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా కంప్రెస్ నేచురల్ గ్యాస్, పైప్ నేచురల్ గ్యాస్, గృహ అవసర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మాత్రం పెంచుతూనే వస్తున్నది. ఎల్‌పీజీ వంట గ్యాస్ సిలిండర్ రేటును పెంచిన మరుసటి రోజే.. సీఎన్‌జీ బాదుడుపై దృష్టి సారిస్తున్నది. ఇంద్రప్రస్థ లిమిటెడ్ సీఎన్‌జీ రేటును తాజాగా పెంచింది. శనివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.
ఢిల్లిలో కిలో రూ.75.61
ఢిల్లి రీజియన్, దానికి ఆనుకుని ఉండే ప్రాంతాలకు సరఫరా చేసే కంప్రెస్ నేచురల్ గ్యాస్ ధరను సవరించినట్టు ఇంద్రప్రస్థ కంపెనీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధంగా పని చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచినట్టు ప్రకటించింది. దీంతో ఢిల్లిలో కిలో సీఎన్‌జీ రూ.75.61 పైసలకు చేరుకుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్‌లో రూ.78.17 పైసలకు చేరుకుంది. గురుగావ్‌లో సీఎన్‌జీ ధర అత్యధికంగా ఉంది. కిలో సీఎన్‌జీ ధర రూ.83.94 పలుకుతున్నది. రెవారిలో రూ.86.07, కర్నల్, కైథల్‌లో రూ.84.27గా ఉంది. కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేపూర్‌లలో రూ.87.40గా ఉంది. అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లల్లో రూ.85.88గా ఉంది. ముంబైకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్.. కిందటి నెలలో ధరను పెంచిన విషయం తెలిసిందే. కిలో ఒక్కింటికి నాలుగు రూపాయల చొప్పున సవరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..