హైదరాబాద్, ఆంధ్రప్రభ : డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను విద్యాశాఖ ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ఈమేరకు బుధవారం విద్యాశాఖ బులిటన్ విడుడల చేసింది. నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు సబ్జెక్టుల వారీగా పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
నవంబర్ 20, 21వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. 23వ తేదీన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు. ఇక 24వ తేదీన లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
25వ తేదీ నుండి 30వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు జరగనున్నాయి. వీటిని ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే వివరాలను సైతం రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్‌లో వెల్లడించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.
ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు. పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది. విద్యాశాఖ ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అత్యధిక పోస్టులు మహిళలకే కేటాయించారు. మొత్తం 5089 పోస్టుల్లో అగ్రభాగం మహిళా అభ్యర్థులకే దక్కనున్నాయి.
బుధవారం (ఈనెల 20) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన మొత్తం 5089 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 2491 పోస్టులు కాగా, మహిళా అభ్యర్థులకు మాత్రం 2598 పోస్టులు కేటాయించారు. అంతేకాకుండా జనరల్ కేటగిరీలోనూ మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులతో సమానంగా పోటీపడే అవకాశం దక్కింది.
దీంతో 55 నుంచి 60 శాతం వరకు ఉద్యోగాలు వారి సొంతం కానున్నాయి. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ (ఏస్‌ఏ) ఖాళీలు 1739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) 2575 పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వివిధ సబ్జెక్టు పోస్టులుంటే, మరికొన్ని జిల్లాల్లోనైతే సున్నా పోస్టులున్నాయి. ఇంకొన్ని జిల్లాలోనైతే సింగిల్ డిజిట్ పోస్టులే ఉన్నాయి. 16 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టులు సున్నా ఉన్నాయి.