మద్యం మత్తులో పోలీసులపైనే దాడికి దిగాడు ఓ తాగుబోతు. దాంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు చూస్తే .. మచిలీపట్నంకు చెందిన మద్దెల కృష్ణ నిత్యం తాగుతూనే ఉంటాడు. అంతేకాదు మద్యం సేవించి ఆ మత్తులో చిల్లరగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందిపెట్టేవాడు. కాగా మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్నాడంటూ డయల్ 100 కు ఫోన్ కాల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరకుని మత్తులో వున్న కృష్ణను సముదాయించే ప్రయత్నం చేసారు. అయితే కృష్ణ పోలీసుల మాట వినకపోగా వారితోనే గొడవకు దిగాడు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నిస్తుండగా తోపులాట జరిగింది. అ క్రమంలో విచక్షణను కోల్పోయిన తాగుబోతు చేతికందిన ఓ ఇటుకరాయిని తీసుకుని పోలీసులపై దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇటుకరాయితో తాగుబోతు బలంగా కొట్టడంతో కానిస్టేబుల్ తల పగిలి తీవ్ర రక్తస్రావమయ్యింది. దీంతో కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని తోటి పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ పై తాగుబోతు దాడి గురించి తెలియడంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. వెంటనే సదరు తాగుబోతును అరెస్ట్ చేయాలన్న ఎస్పీ ఆదేశించారు. దీంతో కృష్ణను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..