Friday, November 22, 2024

మద్యంమత్తులో వాహనాలు నడిపడం తీవ్రమైన నేరం.. కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు

మద్యం సేవించి వాహనాలు నడిపి, ప్రమాదాల‌కు కార‌ణంకావ‌డాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని కరీంనగర్ పోలీస్ క‌మిష‌న‌ర్ సుబ్బరాయుడు అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల స్వయంగా ప్రమాదాలకు గురవ్వడంతోపాటు ఇతరులను ఢీకోనడం వల్ల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌న్నారు. మద్యం సేవించి ఈ మధ్యకాలంలో పట్టుబడిన వాహనదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం క‌మిష‌న‌రేట్‌ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ క‌మిష‌న‌ర్‌ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడటం అవమానకరంగా భావించాలన్నారు. మద్యంమత్తులో మెదడు పనిచేయక, శరీరం ఆధీనంలో ఉండక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు న‌డ‌ప‌డం వల్ల శరీరభాగాలు విరగడం, తలకు తీవ్రమైన గాయాలు కావడం, మరికొందరు జీవచ్ఛవాలుగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

- Advertisement -

మద్యంమత్తులో జరుగుతున్న ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చుతుండగా మరికొందరి కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి రెండవసారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు. చేయడంతోపాటు వారి లైసెన్సులను రద్దుచేసేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులు నమోదైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోవడమే కాకుండా పాస్ పోర్టులు లభించవని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్లనే ఎక్కువశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు..

మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులు, వాహనాల యజమానులపై ఐపీసీ సెక్షన్లతో పాటు ఎంవి యాక్ట్ కేసులను నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు తల్లిదండ్రులు, వాహనదారులు ఆలోచించాలని చెప్పారు. మైనర్లు చిన్నచిన్న కారణాలు చూపుతూ ఎంత బ్రతిమలాడిన కూడా వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ లకు పాల్పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

నడిపిరోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడేందుకు కారకులవుతున్న దుకాణాదాలపై కూడా కేసులను నమోదు చేస్తున్నామని చెప్పారు. దుకాణాదారులు ట్రాఫిక్ నకు అంతరాయం కలుగకుండా వినియోగదారులు పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులతో తాము మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడుపబోమని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసిపి బ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement