హైదరాబాద్ నగరంలోని సైదాబాద్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలలో మినరల్ వాటర్ పేరిట నీటి దందా జోరుగా సాగుతోంది. కొంతమంది పుట్టగొడుగుల్లా వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏళ్ల నుంచి వాటర్ ప్లాంట్ల వ్యాపారులు దందా చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా సైదాబాద్, మాదన్నపేట, చంపాపేట, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలలో ఈ ప్లాంట్లు కొనసాగుతున్నాయి, హోటళ్లు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు మినిరల్ వాటర్ క్యాన్లు కొనడంతో నీటి వ్యాపారం అధికమైంది.
ఇదే అదనుగా పలువురు వ్యాపారులు ఎక్కడ పడితే వాటర్ ప్లాంట్లు నెలకొల్పుతూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. బోరు నుంచే తోడుతున్నారు. ఇళ్లలో, ఖాళీ స్థలాల్లో బోర్లు వేసి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇంటి బోరుతో వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి వీల్లేదు. పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
అనుమతులు లేకుండా..
నిబంధనల ప్రకారం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వ్యయమవుతుంది. కానీ రూ.2 నుంచి 5 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరికి వారు తమ పరిధి కాదంటూ ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది.
ఇదీ ప్రక్రియ..
నిబంధనల ప్రకారం నీటిని 12 సార్లు శుద్ధి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఫిల్టరింగ్, ఎరేషన్, కార్బన్ ఫ్యాక్టరైజేషన్ లాంటి ప్రకియలు జరపాలి. ఆ తర్వాత నీటిని డబ్బాల్లో నింపే ముందు 48 గంటల పాటు పక్కన నిల్వ ఉంచాలి. అనంతరం కెమిస్ట్ పరీక్షలు జరపాలి. ఇందుకోసం నాణ్యత పరికరాలతో కూడిన మైక్రోబయలాజికల్ ల్యాబ్ ఉండాలి. కెమిస్ట్‌ను నియమించుకుని ఎప్పటికప్పుడు నీటిని పరీక్షించాల్సి ఉంటుంది.
ఇవి గుర్తించాలి
★ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా శుద్ధి చేసిన నీళ్లను తాగితే ఆరోగ్యంపై ప్రభావం
★ వ్యాపారానికి ఐఎస్ఐ, బీఎస్ఐ లాంటి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి
★ ఇసుక, కార్బన్, ఫిల్టరైజేషన్ ప్లాంట్లు తప్పనిసరిగా ఉండాలనే విషయాన్ని గుర్తించాలి
★ రివర్స్ అసోస్మిస్ సిస్టం ద్వారా నీటిలో బ్యాక్టీరియాను నిర్మూలించే వ్యవస్థ ఉందో లేదో తెలుసుకోవాలి
★ బయలాజికల్, బ్యాక్టీరియా పరీక్షలు జరుపుతున్నారో అడగాలి
★ ప్యాకింగ్‌పై వివరాలు ముద్రిస్తున్నారో లేదో గమనించాలి
★ రెండు ల్యాబ్‌లతో పాటు కెమిస్ట్, మైక్రో బయాలాజిస్టు ఉన్నారో లేదో కనుక్కోవాలి.