Wednesday, November 20, 2024

ఇంట్లో పెళ్లాలు.. వీధిలో పోలీసులు.. మందుబాబుల వినూత్న నిరసన

సంగారెడ్డి జిల్లాలో మందుబాబులు వినూత్న నిరసనకు దిగారు. వైన్ షాపులలో పర్మిట్ రూములు అధ్వాన్నంగా ఉంటున్నాయని, బయట తాగితే పోలీసులు వెల్లగొడుతున్నారని, ఇంట్లో తాగుతామంటే పెళ్లాలు, తల్లిదండ్రులతో గొడవలు వస్తున్నాయని మందుబాబులు ఆవేదన చెందుతున్నారు. దీంతో తాము ఎక్కడ తాగాలి బాబోయి అని మందుబాబులు నడిరోడ్డుపై మందు సీసాలు, గ్లాసులను పెట్టుకుని తాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే వాటిల్లో పర్మిట్ రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో బయట తాగేందుకు వెళ్తున్న వారికి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం నేరమని పట్టణంలోని వివిధ శివారు ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పై కేసులు నమోదు చేసి కోర్టు ద్వారా జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో తాగలేక, బయట తాగలేక ఎటు పోవాలని ఆదివారం పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో ఉన్న మంజునాథ వైన్స్ ముందు మందుబాబులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మందుబాబుల వింత నిరసనను చూసిన స్థానికులు ముక్కున వేలు వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement