చంద్రబాబు కలల ప్రాజెక్టు
గోదావరి-బనకచర్లపై వేగంగా అడుగులు
మూడు నెలల్లో టెండర్లు పిలవాలని ఆదేశాలు
80వేల కోట్ల అంచనాలతో నిర్మాణానికి చర్యలు
పోలవరంతో వంశధారను కనెక్ట్ చేసే ఆలోచనలు
నెల్లూరు, ప్రకాశం ఊమ్మడి జిల్లాలకు ప్రయోజనం
వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సాయం పొందేలా యోచన
పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్న ఏపీ
ఏడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులకు సన్నద్ధం
పరిపాలనలో దూకుడు పెంచిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్:
సీఎం చంద్రబాబు ఖాతాలో మరో కలల ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కీలక అడుగులు పడ్డాయి. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జలవనరులశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. వ్యాప్కోస్ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం జరగనుంది. దీని కోసం మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
నదుల అనుసంధానం ఇలా..
పోలవరంతో వంశధారను కనెక్ట్ చేయడం ఒకటి, అటు రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించేలా మరో కనెక్ట్ చేయడం మరొకటి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగు నీరు అందించాలని నిర్ణయించారు. ఎగువ ప్రాజెక్టుల వలన కృష్ణా నీళ్లు ఏపీ వరకు రావడం లేదు. మరోవైపు గోదావరిలో నీళ్లు ఏటా 2,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి గోదావరి వరద నీటిని కృష్ణాకు తరలించాలని నిర్ణయించారు.ఇదే జరిగితే రాష్ట్రం మొత్తం నీటి కష్టాలు తీరుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి దీన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి దీనిపై చంద్రబాబు కేంద్రంతో కూడా ఇప్పటికే మాట్లాడారు. కొంతమేర కేంద్రం సాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు..
గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలుగుతల్లికి జలహారతిగా పేరు పెట్టినట్టు ప్రకటించారు. ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఇప్పుడు దీన్ని నిర్మించకపోతే భవిష్యత్‌లో అసలు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఐదేళ్లకు ఖర్చు 40-50 శాతం పెరుగుతోందని, మరో ఐదేళ్లు ఆగితే ఈ ప్రాజెక్టు ఖర్చు లక్షా 60 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఖర్చు ఎలా ఉన్నా.. రైతుల నుంచి రూపాయి కూడా వసూలు చేయబోమని సీఎం చంద్రబాబు క్లారటీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ప్రభుత్వం కొంత సమకూరుస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే జీఎస్టీ, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి మొదటి ఏడాది నుంచే ఆదాయం వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
పారిశ్రామికంగా ముందడుగు..
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీని ఈమధ్యే సీఎం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన రంగాల్లో లక్షా 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2లక్షల 63వేల 411 మందికి ఉపాధి లభిస్తుందని సర్కార్ అంచనా. ఈ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించాలని ఆదేశించారు. మనం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల ద్వారా మరిన్ని పరిశ్రమలు రావాలని ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు..
మరో ఏడు విమానాశ్రయాలు..
ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో ఆయన సమీక్షించారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకారంలో నిర్మాణం జరగనుంది. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.