హనీ ట్రాప్‌లో చిక్కుకుని పాక్ మహిళా ఏజెంట్‌కు సమాచారాన్ని లీక్ చేసినందుకుగాను టెస్ట్ రేంజ్ అధికారిని ఒడిశాలో అరెస్టు చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్‌లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ)కి చెందిన సువిశాల క్షిపణి పరీక్ష- మూల్యాంకన కేంద్రం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) సీనియర్ ఉద్యోగిని శుక్రవారం అరెస్టు చేశారు. హనీ ట్రాప్ అయిన ఆ ఉద్యోగి బాలాసోర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన బాబూరామ్‌డే (51)గా పోలీసులు గుర్తించారు. ఐటీఆర్ టెలిమెట్రీ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్‌గా డే పనిచేస్తున్నారు.
”లైంగిక తృప్తి మరియు ద్రవ్యానికి ఆశపడిన డే పాకిస్తాన్ ఏజెంట్‌కు క్షిపణి పరీక్షకు సంబంధించిన రహస్య, అత్యంత సున్నితమైన సమాచారాన్ని అందించినట్లుగా మేము సాక్ష్యాలు సంపాదించాము” అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (తూర్పు శ్రేణి) హిమాన్షులాల్ తెలిపారు. ఐటిఆర్ ఉద్యోగి దేశ వ్యతిరేకిగా గూఢచర్యానికి పాల్పడుతున్నారనే సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అతనిపై నిఘా పెట్టారని బాలాసోర్ ఎస్పీ సాగరికనాథ్ తెలిపారు. నిందితుల బ్యాంకు వివరాలు, ఫోన్‌కాల్స్‌ను పరిశీలిస్తున్నామని సాగరికనాథ్ తెలిపారు. 2021 సెప్టెంబర్‌లో కూడా చండీపూర్ ఐఆర్‌టికి చెందిన నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులను పాక్ మహిళ హనీ ట్రాప్‌తో అరెస్టయ్యారు.