Friday, November 22, 2024

TS: ప్రాజెక్టుల పేరుతో డ్రామాలు – కాళేశ్వ‌రం టూర్ మ‌ళ్లీ ఎందుకు? బండి సంజ‌య్

ప్రాజెక్టుల పేరుతో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయ‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. అసెంబ్లీ స‌మావేశాలు పక్క‌న‌పెట్టి ఇప్పుడు మ‌ళ్లీ కాళేశ్వ‌రం టూర్ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కోనారావుపేట‌లో జ‌రిగిన ప్ర‌జాహిత బ‌స్సు యాత్రలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం మీద కాంగ్రెస్ అసెంబ్లీలో డ్రామాలాడుతోంద‌ని, బీఆర్ఎస్ నేతలు కృష్ణా నీళ్లు అని నాటకాలాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

అసెంబ్లీలో నిమిషానికి రూ. 20వేలు ఖర్చవుతుంద‌ని, ఈ లెక్కన సభ నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తూ కాల‌యాప‌న చేస్తున్నార‌న్నారు. కానీ ప్రజా సమస్యలను, వాళ్లకిచ్చిన హామీలను గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారని, ఇంజనీరింగ్ నిపుణుల బృందం వెళ్లి విచారణ జరిపి నివేదిక ఇచ్చిందన్నారు. కేంద్ర బృందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చిందని, మళ్లీ సీఎం, మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement