హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రాచీన నదినాగరికతలో ప్రాధాన్యత ఉన్న మూసీ నది జలాశయం పునరుద్ధరణకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ పాత కొత్తనగరాలను విడదీసుకుంటూ ప్రవహిస్తూ సోలిపేటలో రిజర్వాయర్‌గా అవతరించిన మూసీ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నది. 240 కిలోమీటర్ల పరివాహప్రాంతంతో 1952 వరకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన మూసీ నది మురికి కూపంగా మారినప్పటికీ ఉప నదులను కలుపుకొని భారీప్రవాహంగా అవతరించి సోలిపేట రిజర్వాయర్‌గా రూపుదిద్దుకుంది.
ఈ ప్రాజెక్టు 1954లో నిర్మాణం తలపెట్టి 1963లో నాటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు నల్గొండ జిల్లా సూర్యాపేట కేతేపల్లి, వేములపల్లి మండలాల్లోని 41 గ్రామాల పరిధిలోని 41,800 ఎకరాలకు ఖరీఫ్ మాగాణికి నీటి సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో నిర్మించారు. అయితే పూడిక చేరడంతో రిజర్వాయర్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా కుడి,ఎడమ కాలువల నుంచి ప్రవాహ వేగం తగ్గి లక్ష్యాన్ని ఛేదించలేకపోతుంది. ఎడమకాలువ ద్వారా సూర్యాపేట జిల్లాలోని సూర్యపేట, చివేల్మ, పేన్‌పహాడ్ మండలాల్లోని 21 గ్రామాలకు, కుడి కాలువ ద్వారా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి, మడుగులపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాల్లో 19 గ్రామాల పరిధిలోని 41,800 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.
అయితే సామర్థ్యం మేరకు నీరు అందడంలేదు. ప్రధానంగా పంట కాలువల పూడిక, ప్రాజెక్టులో పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. చిన్నపాటి వరదలకే కేతేపల్లి దగ్గర మూసి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. ప్రాజెక్టు నిల్వసామర్థ్యం 645 అడుగులు ఉన్నప్పటికీ పూడిక తీయకపోవడంతో ప్రాజెక్టు త్వరితగతిన నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపుగా ప్రతి వర్షాకాలంలో 4వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తుండటంతో మూసీ గేట్లు ఎప్పటికప్పుడు తెరవాల్సిన పరిస్థితి నెలకొంది.
మూసీ ప్రాజెక్టు 1963 నిర్మించినప్పటికీ సమైక్య పాలకులు ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో క్రమేణ మూసీ మూసుకుపోతోంది. అలాగే పారిశ్రామిక వ్యర్థపదార్థాలను 1980 నుంచి మూసీలో కలపడంతో మూసీ అనేక సవాళ్లను విసురుతూ దేశంలోని కాలుష్యనదుల్లో మొదటి వరుసలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూసీ రివర్ ఫ్రెంట్ అథారిటీ ఏర్పాటుచేసి కాలుష్య నియంత్రణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూ మరో వైపు మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టారు. జీవో ఆర్‌టీ నం. 850 ఐ అండ్ సీఏడీ (ప్రాజెక్టు-1) ద్వారా మూసీ ఎడమ, కుడి కాలువల పునరుద్ధరణకు రూ.6కోట్ల 56లక్షల 90వేలకు పరిపాలన పరమైన అనుమతులు లభించాయి. పనులు పురోగతిలో ఉండటంతో సెప్టెంబర్ నాటికి మూసీ ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.