Saturday, November 23, 2024

Canada | విద్యార్థి వీసా డిపాజిట్‌ రెట్టింపు.. నిబంధనలు మరింత కఠినతరం

ఉన్నత విద్యకోసం తమదేశం వచ్చే అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేస్తోంది. స్టూడెంట్‌ వీసా దరఖాస్తు దారుల ఆర్థిక సంసిద్ధతను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థి విసా డిపాజిట్‌ను ఒకేసారి రెట్టింపు చేసింది. ప్రస్తుతం వీసా డిపాజిట్‌ పరిమితి 10 వేల డాలర్లుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఈ మొత్తం 20,635డాలర్లకు పెరగనుంది. 2024 జనవరి 1నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

కెనడాలో జీవన వ్యయానికి సంబంధించిన విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుచేత జీవన వ్యయ పరిమితిని పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. తద్వారా ఇక్కడి పరిస్థితులను వారు అర్థం చేసుకోగలరని, విద్యార్థుల అవసరాలకు తగిన వసతి కల్పన మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని పేర్కొంది. ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి అంతర్జాతీయ విద్యార్థులను రక్షించేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తెలిపారు.

అదే సమయంలో అంతర్జాయ విద్యార్థులు క్యాంపస్‌ బయట వారానికి 20 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కెనడాలో ఉంటున్నవారు, డిసెంబర్‌ 7నాటికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే పని గంటల మినహాయింపు పొడిగింపు వర్తిస్తుందన్నారు. కాగా, భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యకు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా నిబంధన భారత విద్యార్థులకు భారంగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement