Thursday, November 21, 2024

బతుకమ్మ పండుగ రోజున ‘డ‌బుల్’ సంబురం : మంత్రి హ‌రీష్ రావు

వర్గల్ : బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉంద‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం తునికి-ఖల్సాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించే కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్ రావు హాజర‌య్యారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉంది. సద్దితిన్న రేవు తలిస్తే.. దేవుడు సల్లగా చూస్తాడని అన్నారు. గ‌త కాంగ్రెస్ హయాంలో బేస్మెంట్ కే డబ్బులు సరిపోయేవి కావని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టి, కడప పెట్టి, ఇళ్లు తాళం చెవి మీ చేతిలో పెట్టి కొత్తింట్లోకి తోలుతున్నామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలుగా విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డిలు ఎవరొచ్చినా.. మీ గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారలేదని, సీఎం కేసీఆర్ వచ్చాక గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారింద‌న్నారు.

బీజేపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ. దేశంలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు లేవని డబుల్ ఇంజన్ గవర్నమెంట్ బీజేపీ పై మంత్రి మండిపడ్డారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లోని పింఛన్లను మన తెలంగాణ రాష్ట్రంలోని పింఛన్లకు, అలాగే కరెంటు కూడా సరిగ్గా లేక గోస పడుతున్నట్లు.. ఇలా ఎన్నోరకాలుగా చాలా వత్యాసం ఉంద‌న్నారు 70 ఏండ్లలో కాని పనిని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో రూ.70, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఇచ్చారనీ, కానీ ఇవాళ సీఎం కేసీఆర్ వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు రూ.2016 అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి. ప్రతీ మండలానికి ఎస్సీ వెల్ఫేర్, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కేసీఆర్ సర్కారు తెచ్చినట్లు పేర్కొన్న మంత్రి. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హిందు-ముస్లింలు ప్రతీ కులం, మతం వాళ్లు సంతోషంగా ఉన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఫెయిల్ రాష్ట్రం గుజరాత్ అయితే అన్నింటా ఆదర్శ రాష్ట్రం తెలంగాణ ఉంద‌న్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరికీ అభివృద్ధి జరిగింది. ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు, అర్హులందరికీ ఆసరా ఫించన్లు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్నాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement