Friday, November 22, 2024

Ayodhya: విఐపిలు ప‌ది రోజుల పాటు ఆయోధ్య‌కు రాకండి …ట్ర‌స్ట్ విన‌తి

బాల రాముడి దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. జనాలను అదుపు చేయడం భద్రతా బలగాలకు సవాలుగా మారింది. తొలిరోజైన మంగళవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనాన్ని కొంతసేపు నిలిపివేసింది ఏకంగా ఒక్క రోజే అయిదు ల‌క్ష‌ల మంది భ‌క్తులు రామ ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఇక, నేడు భ‌క్తులు వెల్లువెత్తారు.. దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా క్షణక్షణం అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు. ఆయన ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోంశాఖ) సంజయ్ ప్రసాద్ స్వయంగా రామమందిరంలో ఏర్పాట్లను చూస్తున్నారు. పెరుగుతున్న భ‌క్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రానున్న 10 రోజుల పాటు వీఐపీలు అయోధ్యకు రావొద్దని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ద‌ర్శ‌న వేళ‌లు పొడిగింపు…
రాంలాల దర్శనం కోసం వ‌స్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రద్దీ నిర్వహణకు పలు చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భక్తులందరినీ క్యూలైన్లలో నిలబెట్టి దర్శనం నిరంతరం కొనసాగిస్తున్నారు.

- Advertisement -

బ‌స్సు స‌ర్వీస్ లు ర‌ద్దు ..
లఖ్‌నవూ నుంచి అయోధ్యకు బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదని తెలిపారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని యూపీఎస్‌ఆర్టీసీ అధికారి వెల్లడించారు. ఇక ప్రస్తుతం 8 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ”బాలరాముడి దర్శనం కోసం భక్తులు తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉంది. వృద్ధులు, దివ్యాంగులు రెండు వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement