దేశంలో కరోనా కొత్తవేరియంట్ ‘ఎక్స్‌ఈ’ కేసుల ఉనికిపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఇది నాలుగో తరంగానికి దారితీస్తుందేమోనన్న సందేహం వ్యక్తమవుతోంది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్స్‌ఈ వేరియంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని, వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపైనా ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. ‘ఒమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఎక్స్‌ఈ తోపాటు ఇతర రకాలు కేవలం ఎక్స్ సిరీస్‌లో భాగమే. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయి. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్‌లో ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇటువంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదు’ అని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.
ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఎక్స్‌ఈ వేరియంట్ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాలకూ పాకింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే, ఎక్స్‌ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ అధిక సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్‌ఈ వేరియంట్‌కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..