Friday, November 22, 2024

మంకీపాక్స్‌ విషయంలో డోంట్​వర్రీ.. అప్రమత్తంగానే ఉన్నాం : మంత్రి హరీశ్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంకీ పాక్స్‌ వైరస్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణలో మంకీపాక్స్‌ కేసులు నమోదు కాకపోయినా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అనవసర ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క మంకీ పాక్స్‌ కేసు నమోదు కాలేదని, అనుమానిత లక్షణాలతో ఉన్న వారు కూడా రాలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మంకీ పాక్స్‌ కేసుల పెరుగుదలను గమనిస్తూ… డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు చెప్పారు. మంకీపాక్స్‌ వైరస్‌, లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూస్తుండడంతో ఈ విషయమై సోమవారం డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో వెంగల్‌రావ్‌నగర్‌లోని ఐఐఎఫ్‌హెచ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంకీ పాక్స్‌ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అనుమానిత కేసులకు తక్షణ చికిత్సను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాంధీ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వస్తే నిర్దారణ కోసం నమూనాలను పూణలోని ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు. మంకీపాక్స్‌ లక్షణాలు, పరీక్షలు, చికిత్సా విధానంపై వైద్యులంతా అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయి సిబ్బందికి వివరించాలని సూచించారు. వైరస్‌కు సంబంధించిన అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంకీపాక్స్‌ నమోదైన దేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారు ఏ మాత్రం లక్షణాలు కనిపించినా సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు, మంకీపాక్స్‌, వ్యాక్సినేషన్‌, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాల కోసం 040-24651119, 9030227324నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి…
వర్షాలు, వరద ల కారణంగా సీజనల్‌ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, రాబోయే వారం పది రోజులు అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఓపీ సమయాన్ని పెంచి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సూపరిండెంట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలన్నారు. పేషెంట్లకు మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లు 24 గంటలు పనిచేయాలని, ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైట్‌, శానిటేషన్‌ టెండర్లు దాదాపు పూర్తయ్యాయని, రోగులకు మంచి డైట్‌ అందించడంతోపాటు శానిటేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కొత్త డైట్‌ మెనూను ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎంఎంఎల్‌/ఈఎంఎల్‌లో మందుల సంఖ్యను 843కు పెంచామని, వైద్యులు బయటకు మందులు రాయకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ఆసుపత్రుల సూపరిండెంట్లదేనన్నారు. కొత్త మందుల జాబితా గురించి పీజీ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు తెలియజేయాలన్నారు.

అర్హులందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి…
18ఏళ్లు దాటి రెండో డోస్‌ వేసుకుని 6 నెలలు పూర్తయిన వారికి బూస్టర్‌ డోస్‌ను అందించాలని ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం కల్పించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement