Sunday, November 17, 2024

TS: కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేసి వృధా చేసుకోవద్దు.. గంగుల

కాంగ్రెస్, బీజేపీలకు విలువైన ఓటు వేసి వృధా చేయొద్దని, ఆ రెండు పార్టీలు ఒకటేనని… వారికి అధికారం కట్టబెడితే… మరోసారి తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి… ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపుర్, మందులపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మంగళ హారతులు, గజమాలతో స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ళ మధ్య పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఓటు అమూల్యమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే తెలంగాణ మళ్ళీ అంధకారం అవుతుందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా… లేదా ఎన్నికలప్పుడే కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయి.. జైలుకు వెళ్లి వచ్చే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్… బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని… మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

తాను ఎమ్మెల్యే కాక ముందు ముగ్ధంపూర్ ఎలా ఉండేది… ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలన్నారు. సమైక్య పాలనలో రోడ్డు లేక ఇబ్బందులు పడ్డ రోజులు ఇంకా గుర్తున్నాయని… కానీ స్వయంపాలనలో ముగ్ధుంపూర్లో గొప్పగా రోడ్లను నిర్మించామన్నారు. గత పాలకులు ఎన్నికలప్పుడే కనిపించి… మళ్లీ కనిపించేవారు కాదని… తాను 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తర్వాత… మీ మధ్యే ఉంటూ… మీరు అడిగిన ప్రతి ఒకటీ నెరవేర్చానన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నిధులు అడిగితే వెకిలిగా నవ్వాడే తప్పా… రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం పాలనలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత వందలాది కోట్లు తెచ్చి ముగ్ధుంపూర్ ను అభివృద్ధి చేశానని… ఆ అభివృద్ధి ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉందన్నారు. సమైక్య పాలనలో సాగునీటి కోసం కరెంటు కావాలని ఆందోళన చేస్తే తన కాళ్లు విరగగొట్టారని… ఇప్పటికీ ఆ నొప్పి తనను వేధిస్తూనే ఉందన్నారు.

సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు… కెనాల్ లోని నీటిని అడ్డుకొని మన పొలాల్లోకి మళ్ళించిన దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయన్నారు. ఇప్పుడు కెనాల్ లో రెగ్యులేటర్ నిర్మించి సాగునీటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కష్టాలన్నీ తొలగిపోయి మన బతుకులు తెల్ల ముఖమయ్యాయని… పచ్చని తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపి… దోచుకునేందుకు షర్మిల, కిరణ్ కుమార్ రెడ్డిలు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికారం ఇస్తే తెల్ల ముఖాన్ని… నల్ల ముఖం చేసి… ఇక్కడి సంపదను దోచుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో… ఇక్కడి రైతులు భూమికి బరువయ్యే పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని… ఇప్పుడు ఒక్క ఓటు తప్పు జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళు పాగా వేసి ఇక్కడి సంపదను దోచుకుంటారన్నారు. ఆది నుండి తనకు అండగా నిలిచిన ముగ్ధుంపూర్ అంటే తనకు ఇష్టమని… అందుకే ఇక్కడ తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన మహిళ బీఎస్సీ అగ్రికల్చరల్ కాలేజీతో పాటు… పల్లె దవఖానాను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -

గంగుల మాట ఇస్తే తప్పే మనిషి కాదని… ఎన్నికలవేళ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు మరోసారి కాంగ్రెస్, బీజేపీలు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ ఎప్పుడైనా మీకు కనిపించాడా అంటూ అడిగి తెలుసుకున్న గంగుల… భూ కబ్జాదారుడు… 30 కిపైగా కేసులతో… బైండోవర్ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడా… లేక కోర్టుల చుట్టూ తిరుగుతాడా ఆయనకే తెలియాలని… పచ్చని తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దన్నారు. ఢిల్లీ పార్టీలకు అధికారం కట్టబెడితే… కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై తెలంగాణను దోచుకుంటాయన్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement