Saturday, November 23, 2024

అవినీతిపరులను సమర్ధించొద్దు, జీవితఖైదు పడినా పట్టించుకోవద్దు.. తృణమూల్‌ అధినేత్రి మమతా గుస్సా

అవినీతికి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించవద్దని, మద్దతు ఇవ్వొద్దని, చివరకు సొంత పార్టీ నేతలైనప్పటికీ, జీవిత ఖైదు పడినప్పటికీ కఠినంగా వ్యవహరించాలని తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీచర్ల నియామకాల్లో కుంభకోణానికి పాల్పడ్డారంటూ విద్యాశాఖ మాజీమంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో రెండురోజులుగా మౌనం వహించిన మమత, సోమవారంనాడు స్పందిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్థా వ్యవహారంతో తమ ప్రభుత్వానికి, పార్టీకి సంబందం లేదని చెప్పక చెప్పారు. ఆ వివాదానికి వీలైనంత దూరంగా ఉండాలని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచించారు.

ఛటర్జీ ఆరోగ్యంగానే ఉన్నారు – ఎయిమ్స్‌
పార్థా ఛటర్జీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరమేదీ లేదని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వైద్యులు స్పష్టం చేశారు. ఆయనను అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించామని, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులున్నప్పటికీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం మాత్రం లేదని ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అశుతోష్‌ బిస్వాస్‌ మీడియాకు వెల్లడించారు. టీచర్ల కుంభకోణంలో కీలక పాత్రధారిగా గుర్తించిన ఈడీ పార్థా ఛటర్జీని అరెస్టు చేసింది. అయితే, అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చేరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఆర్మీ లేదా కేంద్ర ప్రభుత్వ పరిథిలోని ఆస్పత్రుల్లో ఛటర్జీకి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించడంతో సోమవారం తీసుకువచ్చారు. కాగా పార్థా ఛటర్జీ ఆస్పత్రికి వచ్చినపుడు అక్కడున్న ప్రజలు చోర్‌ చోర్‌ అంటూ నినాదాలు చేయడం విశేషం. కాగా ఛటర్జీ తాజా ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు తెలిపిన ఈడీ, 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement