ప్రజా గాయకుడు గద్దర్ కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని యాంటీ టెర్రరిజం ఫోరం వెల్లడించింది. ఈ మేరకు మీడియాకు లేఖ రాసింది. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించారని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని తెలిపారు. నక్సలిజం (మావోయిజం) సాధారణ పౌరులపై , జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని వెల్లడించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి ఇవ్వాల తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యాంటీ టెర్రరిజం ఫోరం తెలిపింది. చర్య , ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని కోరింది.
పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని, పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరింది. దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ (మావోయిజం) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని పేర్కొంది. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ATF (యాంటి టెర్రరిజం ఫోరం) కన్వీనర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.