Saturday, November 23, 2024

కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు పార్టీల వైరంతో ముడిపెట్టొద్దు: మందా జగన్నాథం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని, అంతమాత్రాన ప్రభుత్వాల మధ్య వివక్ష చూపాల్సిన అవసరం లేదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమక్షంలోనే పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్నాథం, అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన తాను గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశానని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని, ఇలాంటి అనేక పెండింగ్ అంశాల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కానిదంటూ ఏదీ లేదని, అనేక ప్రతిపాదనల విషయంలో నిత్యం కదిలిస్తూ ఉండాలని ఆయనన్నారు. అప్పుడే పనులు త్వరితగతిన పూర్తవుతాయని అన్నారు. ఈ క్రమంలో తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తలా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపజేయాలన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు రాష్ట్రానికి తీసుకురావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తన పాత్ర చాలా కీలకమని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, వాటి మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ ప్రభుత్వాల మధ్య వివక్ష ఉండదు – ఉండరాదు అని మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.

ప్రపంచస్థాయికి బోనాలు..

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మందా జగన్నాథం తెలంగాణ భవన్లో జరుగుతున్న బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారి బంగారు బోనంకు పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా బోనాలు ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల పండుగ ఉనికి కోల్పోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement