షిరిడీ, (ప్రభ న్యూస్) : షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో పాదరక్షలు వాడకూడదన్న నిబంధనలను మరింత కఠినతరంచేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న చీఫ్ ఈవో పి. శివశంకర్ రూల్స్‌ని అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులు, గ్రామస్తులు, అధికారులకు పాదరక్షలు, షూ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాయి బాబా దేవస్థానం ముందు పాదరక్షల దుకాణంలో భద్రపరుచుకుని ఆ తర్వాతే ఆలయంలోకి రావాలన్నారు.
కాగా, ఈ నిర్ణయాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ భౌగోండ్కర్ స్వాగతించారు. ప్రవేశద్వారం వెలుపల పాదరక్షలను ఉంచాలని కొత్త సీఈఓ పి శివశంకర్ నిర్ణయాన్ని హర్షించారు. ఇక.. ఆలయంలోకి వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా కార్పెట్ కానీ, మ్యాట్ వేయాలన్నారు. ఈ నిర్ణయం వల్ల సాయిబాబా సంస్థాన్‌లోని ఆలయ ప్రాంగణంలోనికి, సమాధి ఆలయం వెలుపలకు వెళ్లేందుకు ప్రవేశ ద్వారం బయట కనిపించే భక్తుల పాదరక్షల కుప్పలు కనిపించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.