Sunday, November 17, 2024

ఐఏఎస్‌ రూల్స్‌ మార్చొద్దు.. వెూడీకి కేరళ, తమిళనాడు సీఎంల లేఖలు

ఐఏఎస్‌ (క్యాడర్‌) రూల్స్‌, 1954ను సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పలువురు బీజేపీయేతర ముఖ్య మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తాజాగా ఈ జాబితాలో తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు చేరారు. ఐఏఎస్‌ అధికారుల అసైన్‌మెంట్‌ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం ప్రతిపాదనలు దేశ సమాఖ్య రాజకీయాలు, రాష్ట్ర స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించేలావున్నాయని ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్‌ ఆక్షేపించారు. ఇలాంటి విధానాలతో ఐఏఎస్‌ అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేరని అన్నారు. కాగా, ఈ చర్యను విరమించుకోవాలని కోరుతూ విజయన్‌ కూడా ఇదే విధమైన లేఖను పంపారు. ”ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు క్యాడర్‌ మేనేజ్‌మెంట్‌ విధానాల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట సీనియారిటీల వద్ద అధికారుల కొరతను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని కూడా నేను హైలైట్‌ చేయాలనుకుంటున్నాను” అని స్టాలిన్‌ అన్నారు. ప్రస్తుత డిప్యుటేషన్‌ నిబంధనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని పినరయి విజయన్‌ అన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం..
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ప్రధానిని కోరాయి. ఐఏఎస్‌ అధికారులను కేంద్ర డిప్యూటేషన్‌లో చేర్చేందుకు ప్రతిపాదించిన నిబంధనల మార్పు రాష్ట్రాల పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రులు తమ లేఖల్లో వాదించారు. మితిమీరిన కేంద్రీకరణకు పాల్పడటం ద్వారా అధికారాలను లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రతిపాదించిన అధికారం అఖిల భారత సర్వీసు అధికారుల నైతిక స్థైర్యాన్ని, స్వేచ్ఛను ఈ చర్య నాశనం చేయబోతోందని వాపోయారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండు లేఖలు రాశారు. ”సవరించిన సవరణ ప్రతిపాదన మునుపటి కంటే చాలా క్రూరంగా ఉందని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇది మన గొప్ప సమాఖ్య రాజకీయాల పునాదులకు విరుద్ధం” అని పేర్కొన్నారు. ”వారు ‘సహకార సమాఖ్య’ కంటే ‘ఏక పక్షవాదాన్ని’ ప్రోత్సహింస్తున్నారు. ప్రధాని మోడీ నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారని, ఈ దశలోనే ప్రతిపాదనను విరమించుకుండారని ఆశిస్తున్నాను” అని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్ కూడా ప్రధానికి లేఖలు రాశారు.

సవరించిన ముసాయిదా సవరణ ప్రతిపాదనలోని ప్రధానాంశం ఏమిటంటే, ఒక అధికారి, అతని/ఆమె సమ్మతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక రాష్ట్రం నుండి దేశంలోని ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు దఖలవుతాయి. అతను లేదా ఆమె ప్రస్తుత అసైన్‌మెంట్‌ నుండి వెంటనే విడుదల కావచ్చు అనేలా వుంది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) అధికారులను ఎల్లప్పుడూ రాష్ట్రాలలో నియమించలేమని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడం వల్ల రాష్ట్రాలలో పనిచేసి, కేంద్రానికి తిరిగి వచ్చిన తర్వాత అధికారుల వ్యక్తిగత అభివృద్ధికి ప్రత్యేకమైన దృక్పథం లభిస్తుందని కేంద్రం పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement