Tuesday, November 26, 2024

Big Breaking | ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌నీయొద్దు.. అధికారుల‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జ‌ర‌గ‌కుండా ప్రజలను రక్షించాల‌ని, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాల‌ని మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. గురువారం ఉద‌యం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నారు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని మంత్రుల‌ను ఆదేశించారు.

అనుకోకుండా ప్ర‌మాదాలు జ‌రిగితే, గాయ‌ప‌డిన వారికి వెంట‌నే మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని ఫోన్లలో ఆదేశించారు. తక్షణ రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి సీఎస్ శాంతి కుమారి అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. సెక్రటేరియట్‌లో సీఎస్ శాంతి కుమారి అధికారులతో సమీక్ష, టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ , ఫైర్ సర్వీసులు, పోలీసుశాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేస్తూ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు

- Advertisement -

పోలీసు యంత్రాంగం యావ‌త్తు స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు అప్ర‌మ‌త్తం చేయాల‌ని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. డీజీపీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తున్నద‌ని తెలిపారు.

ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని ఇరిగేష‌న్ శాఖ ఉన్న‌తాధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల వ‌ద్ద ఇన్ ఫ్లోను ముందస్తుగా అంచనా వేసి, గేట్లు ఎత్తివేస్తూ, వరద నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.

రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశిస్తున్నారు. అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, సహాయ చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటన చేపట్టారు. వానలోనే తడుస్తూ, ప్రజలను పరామర్శిస్తూ, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యల కోసం ముందుకు సాగారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను చేపట్టేలా జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చారు. వరద ముంపు ప్రాంతాలను పర్యటించి ప్రజలకు భరోసా క‌ల్పించారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్ చేసి గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లి గ్రామంలో ప్రజలను రక్షించేలా పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా చలివాగుతో పాటు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించి, అక్కడే బస చేస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌.. ధ‌ర్మ‌పురి లోత‌ట్టు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి పున‌రావాస కేంద్రాల‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు. అవ‌స‌ర‌మైన ఆహారం, దుస్తులు పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ స్థానిక పరిస్థితులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్షి, అధికారులతో సమీక్షించారు.

కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను ఆరా తీశారు. మ‌రోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయం భద్రాచలంలో ప్రత్యేకాధికారి అనుదీప్ తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ములుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి భారీ వర్షాల పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేప‌ట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

మహబూబ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ప‌ర్య‌టించి.. ప్రజలకు భరోసానిచ్చారు. వరద నీరు ఇండ్లలోకి నీరు రాకుండా, సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా సూచనలు చేశారు. వరదల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా పరిస్థితులను సమీక్షించారు.

కరీంనగర్ జిల్లా పరిధిలోని వరద పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు మానేరు డ్యామ్ వద్ద వరదను అధికారుల సహాయంతో కిందకు వదిలారు. జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు త‌గిన ఆదేశాలిచ్చారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రేయింబవళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement