Sunday, November 10, 2024

TSCSCL | ఫ్యామిలీ కార్డ్ వదంతులు నమ్మొద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ దరఖాస్తులు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు అప్లికేషన్‌ను ఇప్పటి వరకు రూపొందించలేదని స్పష్టం చేసింది.

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుకు సంబంధించి తాము ఎలాంటి అప్లికేషన్‌ నమూనా పత్రావన్ని విడుదల చేయలేదని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

అప్లికేషన్‌ విడుదలపై వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆ శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న దరఖాస్తు నమూనా పత్రాలపై సోమవారం స్పందించారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్‌ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్‌ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార్‌ సంఖ్య, సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫొటో జత చేసి స్థానిక వీఆర్‌ఓలకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో కొంత మంది దళారులు లబ్ధిదారులతో దరఖాస్తులు నింపిస్తున్నారు. మండల కేంద్రాల్లో జిరాక్స్‌ సెంటర్లు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. ఈ విషయం ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి, కుటుంబ డిజిటల్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి పౌరసరఫరాల శాఖ ఎటువంటి దరఖాస్తు రూపొందించలేదని స్పష్టం చేసింది.

- Advertisement -

ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రకటన విడుదల చేశారు. దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్‌ కోసం ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకోటి ఇలా వేర్వేరుగా కార్డులున్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలుండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్‌ కార్డును తీసుకు వస్తోంది.

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ కన్వీనర్‌గా సీనియర్‌ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ- సెప్టెంబరు 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

గత పది రోజుల్లో సీఎం రేవంత్‌ రెడ్డి డిజిటల్‌ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఐదారు సమావేశాలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్ల్రోని మేలైన అంశాలు తీసుకొంటూ, కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కివచ్చినా, కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement