Friday, November 22, 2024

Farming | తొందరపడొద్దు… అప్పుడే విత్తనాలు విత్తొద్దు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని రైతులకు వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వర్షాధార , ఆరుతడి పంటలు ముఖ్యంగా పత్తి, కంది, పెసర, సోయా తదితర వర్షాధార పంటలు సాగు చేసే రైతులు తొందరపడి విత్తనాలను విత్తొద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవన వర్షం జాడలేకపోవడంతో భూమిలో విత్తనాలు మొలకెత్తేంత తేమ చేరలేదేని, సాగుకు భూమి ఇంకా అనుకూలంగా మారలేదని స్పష్టం చేస్తున్నారు. సరిపడా వర్షాలు కురిశాక, భూమి చల్లబడి, తగినంత తేమ చేరుకున్నాకే విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. విత్తనాలు సాగు చేసేందుకు జులై 15 వరకు సమయం ఉందని, ఇప్పుడే రైతులు తొందరపడి విత్తనాల విత్తొద్దని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ రైతులకు పిలుపునిచ్చారు.

వర్షాఇలు ఆలస్యమవుతున్నందున విత్తనాలు ఈ సమయంలో వేయకపోవడమే మంచిందన్నారు. 60 సెంటీమీటర్లు మేర రెండు వర్షాలు కురిసిన తర్వాతే భూమి చల్లబడి సాగుకు అనుకూలంగా మారుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత పత్తి విత్తనాలను నాటాలని రైతులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 38 నుండి 42 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఈ వేడికి విత్తిన విత్తనం మొలకెత్తే శాతం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. తొందరపడి ఇప్పుడే విత్తనాలు విత్తితే విత్తన కొనుగోలు, దున్నకం, కూలీల ఖర్చు మీద పడుతుందని సూచిస్తున్నారు. వేడి వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి తడులు అందుబాటులో ఉన్నచోట కూడా రైతులు పత్తి విత్తనాలను ఇప్పుడే విత్తకపోవడమే మేలంటున్నారు.

తెలంగాణలో సాగయ్యే పంట విస్తీర్ణంలో సింహభాగం పత్తి పంటదే. ప్రతి ఏటా వాణిజ్య పంట అయిన పత్తిసాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత వరి, కంది, సోయా, మిరప, పసుపు, మొక్కొజొన్న తదితర పంటలను సాగుచేస్తారు. ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగు 65లక్షల ఎకరాలకు మించుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతుండడంతో వర్షాలు లేక దుక్కులు దున్ని సిద్ధం చేసినా విత్తనాలు విత్తేందుకు రైతులు సాహసించడం లేదు.

గతేడాది మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు కురవడంతో జూన్‌ మూడో వారంకల్లా వర్షాధార పంటల సాగు ముఖ్యంగా పత్తి సాగు ప్రారంభమైంది. గడిచిన మూడేళ్లలో జూన్‌ రెండో వారంలోనే రాష్ట్రమంతటా వర్షాధార పంటల్లో ముఖ్యమైన పత్తి విత్తడం పూర్తయింది. అయితే ఈ ఏడాది జూన్‌ చివరి వారం వరకు కూడా నైరుతి పలకరించకపోవడంతో పత్తి, మొక్కజొన్న, సోయా, పప్పు దినుసులు పంటల సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement