తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ఎంఈఐఎల్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరక కంపెనీ ప్రతినిదులు (మంగళవారం) హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి ఐదు కోట్ల చెక్ ను అందించారు.
వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు. కోటి రూపాయల చెక్కు అందజేశారు.
మైత్రా ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రం కైలాస్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి కైలాస్‌లు కోటి రూపాయల విరాళం అందించారు. ప్రముఖ నిర్మాత, నటి యార్లగడ్డ సుప్రియ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు విరాళం చెక్కును అందజేశారు.
హైదరాబాద్ రేస్ క్లబ్, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది. రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహారెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.