ఇతరులకి సాయమందించడంలో ముందుంటారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. వరదలైనా..వర్షాలైనా..ఎవరినైనా ఆదుకోవడానికైనా ముందుంటారు. కాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించారీ హీరో. ఢిల్లీలోని 25 ఏళ్ల యువతి హార్ట్ సర్జరీ కోసం రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. ఢిల్లీలోని గురుగ్రామ్‌కు చెందిన యువతి ఆయుషి శర్మ చిన్న నాటి నుంచే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమెకు గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇలాంటి ఆపరేషన్లు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఏర్పడింది. కానీ ఆమె కుటుంబ ఆ ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేదు.
ఆయుషి శర్మ ఆరోగ్య పరిస్థితి, ఆమె కుటుంబ నేపథ్యం తన సామ్రాట్ పృథ్వీరాజ్ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ద్వారా నటుడు అక్షయ్ కుమార్ కు తెలిసింది. దీంతో ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ పబ్లిసిటీ ఇష్టం లేని ఆయన.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కుటుంబ సభ్యులను కోరారు. కానీ తమ కుటుంబానికి ఇంత సాయం చేసిన అక్షయ్ కుమార్ సేవా గుణం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆయుషి తాత యోగేంద్ర అరుణ్ బయటకు వెల్లడించాడు. దీంతో ఆయన దాతృత్వం వెలుగులోకి వచ్చింది. ఆయుషి మొత్తం చికిత్స ఖర్చు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. నిరుపేదలకు సాయం చేయడంలో చురుకుగా ఉండే అక్షయ్ కుమార్.. అవసరమైతే ఇంకా డబ్బును విరాళంగా ఇస్తానని చెప్పారట.